ప్రాసెసర్ గురించి :
ఇప్పటి వరకు ఉన్న ప్రాధమిక పరిజ్ఞానంతో CPU లోపల ఉన్న Processor గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా CPU యొక్క నమూనా పటాన్ని ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ అన్నిటికన్నా పైన ఉన్నది Processor. ఇది కంప్యూటర్ కి చిన్న మెదడు లాంటిది అని చెప్పుకున్నాము. కానీ పటంలో CPU అని గుర్తించబడి ఉన్నది ఏమి అని అడగవచ్చును. మీరు CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో చర్చనీయాంశాలను చూసినట్లయితే CPU గురించి ఒక విషయం గమనించి ఉంటారు. అది ఏమంటే "సందర్భాన్ని బట్టి CPU ని Processor , Memory, మరియు ఇతర భాగాలతో కూడిన డబ్బాగా అనుకోవచ్చును. లేదంటే ఒక్క Processor నే CPU గా అభివర్ణించవచ్చును." అని. మనం CPU లోపల ఉన్న చిన్న చిన్న భాగాలను గురించి వివరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి; ఈ సందర్భంలో CPU అనేది Processor అవుతుంది. (తదుపరి చర్చ మొత్తంలోనూ Processor అన్న పదమే ఉపయోగింపబడింది. పాఠకుల అవగాహన కొరకు మాత్రమే పై వివరణ ఇవ్వబడింది.)
పై పటంలో Processor తరువాత ముఖ్యంగా కనబడుతున్నవి చదరంగా ఉన్న మరొక రెండు భాగాలు. అందులో పైన ఉన్నది North bridge అనగా ఉత్తర వారధి. క్రింద ఉన్నది South bridge అనగా దక్షిణ వారధి. పై పటాన్ని ప్రపంచ పటంగా అనుకుంటే ఉత్తర దిక్కున ఉన్న దానిని ఉత్తర వారధి అన్నారు. దక్షిణ దిక్కున ఉన్న దానిని దక్షిణ వారధి అన్నారు. అవి ఇతర భాగాలకు Processor కు నడుమ వారధులుగా పని చేస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది.
ఇక పోతే ఈ north bridge కి processor కి నడుమ ఉన్న మార్గాన్ని system bus లేక local bus లేక Front Side Bus అంటారు. అంటే రాజ మార్గము అని చెప్పుకోవచ్చును. ఇది CPU లోకెల్లా అత్యంత వెడల్పైన అత్యంత వేగవంతమైన BUS. (CPU లోపల ఏముంది? -3 పోస్ట్ లో ఇప్పటికే చెప్పి ఉన్నాను BUS అనగా మార్గము అని, సాధారణ ప్రయాణ సాధనం లాంటిది కాదు అని; గమనించగలరు.) ఈ north bridge ద్వారా అత్యంత వేగంగా పనిచేసే, అత్యంత వేగం అవసరం ఐన సాధనాలు system bus కి కలుపబడి ఉంటాయి. ఉదాహరణకి గమనించినట్లైతే RAM, PCI express, Graphic card లాంటివి. ఈ north bridge లో సమాచార వేగం దాదాపుగా processor వేగానికి సమానంగా ఉంటుంది. (ఈ వేగాలు యెంత ఉంటాయి అనేది అంకెలలో త్వరలో తెలుసుకుందాము.)
ఇక మిగిలిన Hard disk , sound card , USB ports మరియు ఇతర PCI పోర్ట్ లు south bridge ద్వారా north bridge కి తద్వారా system bus కి కలుపబడి ఉంటాయి. ఈ south bridge లో సమాచార వేగం north bridge తో పోలిస్తే సుమారు 5 నుంచి 10 వ వంతు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దీని ద్వారా processor కి కలుపు బడుతున్న భాగాలు అంత వేగంగా పని చెయ్యలేవు కాబట్టి వాటికి అంత వెడల్పైన BUS అవసరం లేదు. ఈ south bridge కి north bridge కి మధ్య ఉన్న bus ని PCI BUS అంటారు. ఎందుకంటే దీని ద్వారా దాదాపుగా అన్నీ బాహ్యంగా కలుపబడే (peripheral) మరియు వేగం పరంగా అంత ప్రాధాన్యం లేని భాగాలే కలుపబడుతున్నాయి కాబట్టి.
ఎలాగైతే మహారాజుకి ఆంతరంగిక సలహాదారులు, ప్రధాన మంత్రి అత్యంత ఆప్తులుగా ఉండి అంతఃపురంలో కూడా మహారాజును కలవగలరో అలాగే ఈ north bridge ద్వారా కలుపబడినవి కూడా CPU కి అంత ముఖ్యమైనవి. CPU యొక్క సామర్ధ్యాన్ని వేగాన్ని నిర్ధారించేవి ఈ north bridge ద్వారా కలుపబడిన భాగాలే. ఇక పోతే ఎలాగైతే మిగిలిన అధికారులు, ప్రజలు, యాత్రికులు మహారాజుని కలవాలంటే సభలో మాత్రమే కలవగలరో, అలాగే ఈ south bridge ద్వారా కలుపబడిన భాగాలు కూడా అంత ప్రాధాన్యత సంతరించుకోక north bridge ద్వారా processor కి కలుప బడతాయి. ఇవి మన CPU కి అదనపు హంగులు మాతమే అవుతాయి.
కాబట్టి మన CPU యొక్క సామర్ధ్యాన్ని, వేగాన్ని నిర్ధారించే processor, RAM మరియు ఇతర భాగాలను గురించి తదుపరి post లో వివరంగా తెలుసుకుందాము.
CPU లోపల ఏముంది.? - 3
ఇప్పటి వరకు CPU లో సమాచార నిల్వకు సంబంధించిన భాగాలను గురించి తెలుసుకున్నాము. మరి ఇప్పుడు కంప్యూటర్ లోని ఇతర ముఖ్య భాగాలను గురించి తెలుసుకుందాము.
ఈ పటంలో కనిపించే 5వ భాగం CD/DVD ప్లేయర్. ఇది మనం చూసే సినిమా CD, DVD లను ప్లే చెయ్యటానికి ఉపయోగపడుతుంది. ఇందులో కొత్తగా వస్తున్న మార్పు ఏమంటే BLU-RAY డిస్క్. మనకు తెలిసినంత వరకు సాధారణంగా CD లో అయితే ఒక్క సినిమా అదే DVD లో ఐనట్లైతే 5-6 సినిమాలు పడతాయి. ఇక్కడ CD అంటే compact disk, మరియు DVD అంటే digital video disk. మరి ఈ blu ray డిస్క్ విషయానికి వస్తే ఇందులో 25GB అనగా 35 సినిమాలు పడతాయి.

ఈ blu Ray డిస్క్ చూడటానికి సాధారణ DVD లాగానే ఉన్నది. మరి అందులో అంత ఎక్కువ సమాచారాన్ని ఎలా నిల్వ చేసుకోగల్గుతుంది అనే అనుమానం కలుగవచ్చు. DVD కి BLU RAY డిస్క్ కి ముఖ్యమైన తేడా ఆ డిస్క్ లో కాక అందులో సమాచారాన్ని వ్రాసే విధానంలో ఉంది. మనం స్కెచ్ పెన్ తో అక్షరాలను వ్రాస్తే అవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అదే మామూలు పెన్ తో వ్రాస్తే అది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. ఈ క్రింద చూపిన విధంగా...


అదే విధంగా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో DVD లో కన్నా దగ్గరగా సమాచారాన్ని వ్రాసే వ్యవస్థను తయారు చేసారు. మరి అంత దగ్గరగా వ్రాసినప్పుడు తట్టుకునే విధంగా blu ray డిస్క్ ను DVD కన్నా ఎక్కువ సాంద్రత (density)తో తయారు చేసారు. దీనిని గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుసుకుందాము. ఈ blu ray డిస్క్ ఇంకా అంత ప్రాచుర్యం లోకి రాలేదు.
మరి ఈ CD/DVD డ్రైవ్ యేవిధంగా ఉంటుందో చూద్దాం.


ఈ విధంగా ఈ CD/DVD డ్రైవ్ లకు కూడా ఒక power కేబుల్ మరియు ఒక DATA కేబుల్ ఉంటాయి. ఆ నలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉన్నది POWER CABLE. ఆ రెండవది DATA కేబుల్. గమనించినట్లైతే దీనికి కూడా IDE మరియు SATA అని రెండు రకాల connections ఉన్నాయి. mothebard మీద హార్డ్ డిస్క్ ను ఎక్కడైతే కలుపుతామో ఈ DVD Drive ను కూడా అవే socket లలో కలుపవచ్చు. అందుకే motherboard మీద ఒకటి కన్నా ఎక్కువ sockets ఉంటాయి. మరిన్ని వివరాలకు ముందు POSTగమనించగలరు.
ఇక motherboard మీద అంతటి ప్రాధాన్యత సంతరించుకోని అతి ముఖ్యమైన భాగం PCI SLOT. అది మొదటి పటంలో 7వ భాగం. PCI ని విస్తరిస్తే Peripheral Component Interconnect అవుతుంది. అనగా CPU కి, బాహ్యంగా అనుసంధానం చేసే భాగాలకి మధ్య వారధి అని అర్ధం చెప్పుకోవచ్చును. కంప్యూటర్ ప్రధాన భాగాలను పక్కన పెడితే మనకు అవసరమైన అదనపు భాగాలను connect చెయ్యటానికి దీనిని ఉపయోగిస్తారు. మరి అసలు అదనపు భాగాలు ఎందుకు అవసరం అవుతాయి, ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ఉదాహరణ పరిశీలిద్దాం.
మనం ఒక మంచి కారు కొని దేశ రాజధానికి ప్రయానమవుతున్నాం అనుకుందాం. రాజధాని కాబట్టి దానిని చేరుకోవటానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి. మొదటిది హైవే (ప్రధాన రహదారి) అయితే మరొకటి సాధారణ మార్గం.


మరి మన కారు యొక్క పూర్తి వేగాన్ని చూడాలి అంటే మనం తప్పని సరిగా ప్రధాన రహదారిలోనే ప్రయాణం చెయ్యాలి.
అలాగే మనం CPU వెనుక భాగాన్ని గమనించినట్లైతే (ఇక్కడ చూడండి.) అక్కడ ఉన్న LAN port కానీ VGA పోర్ట్ కానీ, AUDIO ports కానీ ప్రస్తుతం వస్తున్న అధునాతన పరికరాల వేగంతో పని చెయ్యక పోవచ్చును. అలాగని వాటిని మార్చాలి అంటే మొత్తం motherboard ని మార్చాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ PCI slots ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ PCI slots పూర్తి స్థాయి bus నిడివితో motherboard కి కలుపబడి ఉంటాయి. (ఇక్కడbus అంటే కంప్యూటర్ లో సమాచారం ప్రయాణించే మార్గము. అంతే కానీ వాహనం కాదు. గమనించ గలరు.)అనగా ఆయా అధునాతన పరికరాల పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ఉపయోగించుకొనే అవకాశాన్ని కల్పిస్తాయి.
మరి ఇక్కడ ఉన్న అన్ని PCI slot లు ఒకే విధంగా ఈ క్రింద చూపిన విధంగా ఉంటే, అవే slots; VGA card కి, AUDIO card కి, LAN card కి ఒకే విధంగా ఎలా పని చేస్తాయి అనే అనుమానం రావచ్చును.

(ఇక్కడ తెల్లగా కనిపిస్తున్నవి PCI slot లు.) మనకు ఎలాగైతే ఎడ్ల బండి, సైకిలు, స్కూటరు, కారు, లారీ వంటి వివిధ వాహనాలు వచినప్పటికి రోడ్డు మాత్రం ఒకటే ఉన్నదో అదే విధంగా వివిధ పరికరాలు ఉన్నప్పటికీ ఈ PCI slots మాత్రం ఒకే విధంగా ఉండేలాగా నిర్మించబడ్డాయి. అంటే ఇవి ఒక విధంగా processor ని చేరుకోవటానికి ఒక దగ్గర మార్గం మాత్రమే అంతే కానీ ఒక పరికరం కాదు గమనించ గలరు.
ఏ విధంగా అయితే వినాయకుడు పితృభక్తితో గణాధిపత్యాన్ని సులభంగా పొందాడో, అదే విధంగా కొత్త పరికరాలు ఈ PCI slots ద్వారా పూర్తి వేగంతో CPU వెనుక ఉండే port ల కన్నా ముందుగా processor ని చేరి ఉపయోగింప బడతాయి. ఉదాహరణకు vga card ని గమనిద్దాం. అది ఈ విధంగా ఉంటుంది.
దానికి కుడి అంచున ఉన్న గోధుమ రంగు భాగాన్ని PCI slot లో అమర్చటానికి ఉపయోగిస్తారు. క్రింది వైపు ఉన్న VGA port మరియు DVI port లు CPU నుంచి బయటకు వస్తాయి. (ఈ port ల గురించి అవగాహన కొరకు ఈ postను గమనించండి.) అనగా మనం ఒక vga card ని కనుక ఈ PCI slot లో ఉంచినట్లయితే motherboard మీద నిర్మితమై cpu వెనుకనున్న vga పోర్ట్ పని చెయ్యటం మానివేస్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన vga card మాత్రమే ముందుగా processor ద్వారా గుర్తింప బడుతుంది.
ప్రస్తుతం ఈ PCI slots లో వచ్చిన అధునాతన విప్లవం PCI express. దీని ద్వారా ఒకే సారి రెండు మూడు vga card లను అధిక వేగంతో పనిచేయించ వచ్చును. ఈ vga card లు అధునాతన LCD tv లకు LED tv లకు కంప్యూటర్ ని అనుసంధానం చెయ్యటానికి ఉపయోగపడతాయి. ఈ PCI cards మరియు PCI slots గురించి పూర్తి సమాచారాన్ని ముందు ముందు తెలుసుకుందాము. ఈ లోపుగా CPU కొనేముందు ఏ ఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి అనే అంశాన్ని తదుపరి POST లో గమనిద్దాం...
CPU లోపల ఏముంది..? -
మొదటి రోజునుంచి ఉత్కంఠ రేపుతున్న మూసిన గుప్పెటను ఈ రోజు మనం తెరవబోతున్నాం. అదేనండి CPU లోపల ఏముందో చూడబోతున్నాం. ముందు జాగ్రత్త చర్యగా CPU కి ఉన్న అన్ని తీగలను తొలగించండి. ముఖ్యంగా POWER cable (తీగ). ఇప్పుడు CPU వెనుక భాగాన గమనించినట్లైతే దాని కుడి అంచున రెండు, ఎడమ అంచున రెండు స్క్రూలు ఉంటాయి. సాధారణంగా CPU ని తెరవాలంటే కుడి వైపున ఉన్న రెండు స్క్రూలను తీయవలసి ఉంటుంది. సరైన స్క్రూ డ్రైవర్ ని ఎంచుకుని కుడి అంచున ఉన్న రెండు స్క్రూలను తీయండి.

ఇప్పుడు రెండవ పటంలో చూపిన విధంగా మూతను ముందుగా కుడి చేతితో మీ వైపుకు లాక్కొని ఆ తరువాత ఎడమ చేతితో బయటకు తియ్యండి. ఇక్కడ ఏ చేతితో తీస్తున్నమనేది కాదు కానీ ఏ దిశలో తీస్తున్నామనేది గమనించండి. లేదంటే ఈ క్రింది పటంలో చూపిన విధంగా ముందుగా ఎడమ వైపుకు జరిపి ఆ తరువాత పైకి తియ్యండి.
ఇప్పుడు CPU లోపల భాగాలను గమనించండి.

ఇక్కడ మొదటిది అన్నిటికన్నా పైన ఉన్నది SMPS అనగా POWER SUPPLY.ఇది CPU కి శక్తినిచ్చే భాగం.
ఈ SMPS కి క్రింద చదరంగం బల్ల పరిమాణంలో సుమారు నలుచదరంగా ఉండి అన్ని ఎలక్ట్రానిక్ సర్కూట్ లతో గజిబిజిగా ఉన్న భాగమే మన CPU ఆడే అన్ని ఆటలకు రంగస్థలం. దాని పేరు కూడా ఇంచుమించు అలాంటిదే. దానిని Motherboard అంటారు. అంటే CPU కి తల్లి అంత ప్రధానమైనది అని. మనం ఎలాగైతే చదరంగం బల్ల మీద పావులు అన్ని పేర్చి ఆట మొదలు పెడతామో, అల్లాగే, ఎలాగైతే మొండేనికి ఒక ప్రక్క చేతులు, మరొక ప్రక్క కాళ్ళు, ఇంకొక ప్రక్క తల తగిలిస్తే పూర్తి శరీరం అవుతుందో అల్లాగే ఈ Motherboard మీద అన్నీ సరైన స్థానాలలో అమరిస్తే computer తయారవుతుంది.
ఈ Motherboard లోకెల్లా అతి ముఖ్యమైనది, అతి ఖరీదైనది, అతి సున్నితమైనది మరియు చిన్నది మధ్యలో FAN ఆకారంలో గుండ్రంగా ఉన్న భాగం. అసలు భాగం ఆ FAN క్రింద సేద తీరుతూ ఉన్నది. అదే PROCESSOR. మన చిన్న మెదడు లాగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేది, మొత్తం కంప్యూటర్ ని శాసించే అతి ముఖ్యమైన భాగం ఇదే. అందుకే దానికి అన్నీ రాచ మర్యాదలు. CPU మొత్తానికి కలిపి ఒకే ఒక FAN ఎడమ వైపు డబ్బాకి తగిలించి ఉంటే ఈ processor కి మాత్రం ప్రత్యేకంగా మరొక FAN ఏర్పాటు చెయ్యబడింది.
ఎలాగైతే రావణుడి ప్రాణాలు గుండెలో కాకుండా భద్రంగా అనేక కవచాల మధ్య కడుపులో దాచుకున్నదో అలాగే ఈ processor కూడా FAN క్రింద అనేక కవచాల నడుమ భద్రంగా దాచబడిన అంగుళం ప్రమాణం లో ఉండి వెంట్రుక వాసి మందంతో ఉన్న నలుచదరపు వస్తువు.

ఆ రెండవ బొమ్మలో పెద్ద చదరం మధ్యలో తెల్లగా కనిపిస్తున్నది అదే...
ఆ తరువాత దాని చుట్టూ రక్షణ వలయాలు యెంత కట్టుదిట్టంగా ఉంటాయి అంటే, దాని మీద ఈగ కాదు కదా, కనీసం దుమ్ము రేణువు కూడా తగలనంత జాగ్రత్తగా ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకంటే దుమ్ము తగిలినా అది పని చెయ్యటం మానేస్తుంది. ఎలాగైతే విద్యార్ధి తలమీద వెన్న ముద్దైనా కరుగుతుందంటారో అలాగే ఈ processor చేసే పనికి అంత వేడి పుడుతుంది. అందుకే దాని నెత్తిమీద తడి గుడ్డ వేసినట్లుగా HEAT SINK అనే (వేడిని గుంజుకునే) ఒక తెల్లని లోహపు బిళ్ళ ఉండి, దాని పైన ఒక FAN ఉంటుంది. ఈ క్రింద చూపిన విధంగా...
దయచేసి ఆ FAN కి HEAT SINK కి పట్టిన దుమ్ముని దులపటం తప్ప(అది కూడా సున్నితంగా), ఆ భాగాన్ని కనీసం కదిలించే ప్రయత్నం కూడా చెయ్యవద్దు. దానిని మళ్లీ యధాస్థానంలో సక్రమంగా స్థాపించాలంటే నిపుణుల వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో ఎటువంటి ప్రయోగాలు చెయ్యకండి. ఈ ఒక్కటి తప్ప దేనినైనా మనం ఊడతీసి బిగించవచ్చు. ఆ వివరాలు క్రింద చూద్దాం.
ఈ PROCESSOR తరువాత ముఖ్యమైన భాగం దాని కుడి ప్రక్కన SCALE బద్ద ఆకారంలో ఉన్న RAM. ఎలాగైతే మనం ముఖ్యం అనుకున్న విషయాలను నోట్లో మననం చేసుకుంటామో అలాగే ఈ RAM కూడా processor కి అతి ముఖ్యమైన విషయాలు, తరచూ అవసరం అయ్యే విషయాలను భద్రపరచి PROCESSOR కి అవసరమైనప్పుడు అందిస్తుంది.

RAM అంటే Random Access Memory అనగా దీనిలో నిల్వ ఉన్న (అతి కొద్ది మరియు అత్యంత అవసరమైన) సమాచారం మొదటి నుంచి చివరి వరకు ఏ భాగాన్నైనా మనం ఒకే వేగంతో అంది పుచ్చుకోవచ్చు. Random అంటే యాదృచ్చికం అని అర్ధం. అంటే RAM లోని సమాచారాన్ని మనం యాదృచ్చికంగా ఎక్కడిదైనా ఒకే వేగంతో పొందవచ్చు. అనగా సమాచార సరఫరా లో ఎటువంటి ఆలస్యం ఉండదు. మనం నోట్లో మననం చేసుకునేది కూడా ఇలా అడిగిన వెంటనే గుర్తుకు రావటానికే గమనించగలరు. అయితే ఇక్కడ సమాచారం సరఫరా లో వేగం పొందినందుకు మూల్యం మనం మరొక చోట వెచ్చించాల్సి ఉంటుంది. ఆ విషయాలు తదుపరి POST లో తెలుసుకుందాము.
ఈ RAM ని సవరించాల్సిన అవసరం అప్పుడప్పుడు కలగవచ్చు. అప్పుడు దానికి రెండు వైపులా ఉన్న క్లిప్పు లాంటి వాటిని ఎడం చేసి దానిని తొలగించాలి.


RAM కి మధ్యలో ఉన్న నొక్కు(పటం లో 3), MOTHERBOARD మీద RAM SLOT (RAM ఉంచే స్థానం) కి మధ్య ఉన్న నొక్కు (పటం లో 4)ఒక దిశలో మాత్రమే ఏకీభవిస్తాయి. అది గమనించి పెట్టాలి. RAM ని ఆ విధంగా SLOT లో ఉంచిన తరువాత (గమనించండి RAM ని అక్కడ ఉంచాలి, అంతే కానీ నొక్కి బల ప్రయోగం చెయ్యవలసిన అవసరం లేదు.) ఆ తరువాత రెండు వైపులా ఉన్న క్లిప్పులను RAM యొక్క పై నొక్కు (పటం లో 1) లోకి చేరేటట్లుగా నొక్కాలి. ఇక్కడ రెండు వైపులా 'టక్' మని శబ్దం వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక విధంగా ఆ శబ్దమే RAM సక్రమంగా అమర్చబడింది అనటానికి సూచన. ఒక్కొక్క సారి ఈ 'టక్' అనే శబ్దం రాక పోవచ్చు కానీ రెండు ప్రక్కలా క్లిప్పులు పై నొక్కులోకి చేరి ఉండవచ్చు. గమనించండి. అనవసరంగా కంగారుపడి దాని మీద బల ప్రదర్శన చేయకండి.
స్థలాభావం వల్ల మిగిలిన భాగాలను గురించి వివరంగా తరువాత POST లో గమనిద్దాం... ఈ లోపు CPU మూతను యధా స్థానంలో బిగించి ఉంచండి...