Thursday, October 11, 2018

Computer Knowledge - ప్రాధమిక పరిజ్ఞానం - 1

ప్రాధమిక పరిజ్ఞానం - 1

    ఈ రోజు మనం డెస్క్ టాప్ కంప్యూటర్ గురించి తెలుసుకుందాం. దాని పేరునిబట్టి అది బల్ల మీద పెట్టుకునే కంప్యూటర్ అని అర్ధం అవుతుంది. దీనిని మనం ఇళ్ళలోనూ ఇంటర్నెట్ సెంటర్ లలోను చూడవచ్చు. వివిధ రకాల డెస్క్ టాప్ కంప్యూటర్లను మనం ఇప్పుడు చూద్దాం.
http://i56.tinypic.com/30mvlec.jpghttp://i56.tinypic.com/mutojm.jpghttp://i53.tinypic.com/bdwspt.jpg 

సరిగ్గా గమనించినట్లైతే ఇందులో నాలుగు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. అవి ఏమిటో చూద్దాం. ఇందులో మొదటగా మన కంటికి కనిపించేది, కొంచెం తెలిసినట్లు అనిపించేది (టీవీ లాగా కనిపిస్తున్న)మోనిటర్ (Monitor). తెలుగులో అయితే తెర అనుకోవచ్చు. కంప్యూటర్ అనే ఈ బ్రహ్మ పదార్ధం లోపల ఏమి జరుగుతుందనేది చూడటానికి మాత్రమే అది ఉపయోగ పడుతుంది. 
మరి కంప్యూటర్ కి టివి కి తేడా చూపించగల ముఖ్యమైన భాగం ఎక్కడ ఉంది? మొదటి బొమ్మలో ఎడమ ప్రక్కన, రెండవ బొమ్మలో కుడి ప్రక్కన ఉన్న డబ్బా లాంటి ఆకారమే ఆ ముఖ్యమైన భాగం. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు ఈ కంప్యూటర్ ప్రాణం అంతా ఆ డబ్బాలోనే ఉంటుంది. దానినే CPU అంటారు. మరి ఆ మూడవ బొమ్మలో ఆ డబ్బా ఏమైనట్లు? అలాంటి డెస్క్ టాప్ లు ఈ మధ్యనే కొత్తగా తాయారు చేస్తున్నారు. వాటిలో ఆ CPU అనే భాగం తెర (Monitor) వెనుక ఉండి అన్ని పనులను నడిపిస్తుంది. 
  ఇక మిగిలినవి పురాతన టైపు రైటర్ మీద ఉన్నట్లుగా అక్షరాలు ఉన్న ఒక చెక్క బల్లలాంటి వస్తువు; దానిని కీ బోర్డు అంటారు. కంప్యూటర్ కి నోరు చెవులు లేవు కాబట్టి దానికి అర్ధం అయ్యే లాగా చెప్పాలి అంటే ఈ కీ బోర్డు అవసరం అవుతుంది. మనం ఎలాగైతే మూగ, చెవిటి వారికి అర్ధం అవటానికి కాగితం మీద వ్రాసి చూపిస్తామో అలాగే కంప్యూటర్ కి అర్ధం అయ్యేలాగా చెప్పాలి అంటే కీ బోర్డు మీద టైపు చేసి చూపించాలి. మరి మనం మూగ చెవిటి వారితో మాట్లాడాలి అంటే సైగలు చేస్తాం కదా అని అడగవచ్చు. కను సైగలను కూడా అర్ధం చేసుకుని అడిగిన పనులను చేసే కంపూటర్లు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ లోపుగా ప్రస్తుతం ఉన్న కంపూటర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
  ఇక చివరగా మిగిలిన అతి చిన్న అర చేతిలో ఇమిడి పోయే వస్తువు Mouse (మౌస్). Mouse అంటే చుంచు ఎలుక అని అర్ధం. దాని ఆకారాన్ని బట్టి దానికి ఆ పేరు వచ్చింది. మనం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని సైగలతో చెప్పగల్గిన విషయాలను ఈ Mouse ని అటు ఇటు కదిలించటం ద్వారా చూపించ వచ్చన్నమాట. అంతే కాకుండా ఈ మౌస్ తో ఇంకా కొన్ని ముఖ్యమైన పనులు కూడా చెయ్యవచ్చు.  ఆ విషయాలను గురించి కూలంకషంగా మనం త్వరలోనే తెలుసుకుందాం.
ఇక పోతే అతి ముఖ్యమైన భాగం అనుకున్న CPU మూసిన గుప్పెట్లో ఏమి దాచుకుంది? మనం చెప్పిన పనులన్నీ, అంతే కాక మనకు కష్టం ఐన పనులను కూడా అంతా సులువుగా చేయగల శక్తితో మనుషులను కూడా శాసించ గల శక్తి దానిలో ఎక్కడ నిక్షిప్తమై ఉంది అనే విషయాలను మనం రేపు తెలుసుకుందాం. అంత వరకు శలవు తీసుకుంటూ...

No comments:

Post a Comment